కొత్త తరహా విలనీకి అర్థం చెప్పిన విలక్షణ ప్రతి నాయకుడు రాజనాల!
on Jan 2, 2025
(జనవరి 3 నటుడు రాజనాల జయంతి సందర్భంగా..)
పాతతరం నటుల్లో విలన్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు రాజనాల. విలనీకి నిలువెత్తు నిదర్శనం ఆయన. పౌరాణికాలైనా, జానపదాలైనా, సాంఘికమైనా దుష్టపాత్రలకు రాజనాల పెట్టింది పేరు. విలన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని పాతిక సంవత్సరాలపాటు తిరుగులేని బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. 1953లో ప్రతిజ్ఞ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన రాజనాల 1995లో విడుదలైన తెలుగు వీర లేవరా చిత్రంతో ముగిసింది. 45 సంవత్సరాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 1350 సినిమాల్లో నటించారు. వాటిలో ఎక్కువ శాతం విలన్ పాత్రలే ఉంటాయి. హాలీవుడ్‌కి చెందిన ఎంజిఎం సంస్థ మాయా ది మ్యాగ్నిఫిషెంట్ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని ఇండియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు రాజనాల గురించి తెలుసుకున్న దర్శకనిర్మాతలు అందులో ఒక ముఖ్యమైన ఇండియన్ ఆఫీసర్ పాత్రను ఇచ్చారు. అలా హాలీవుడ్ సినిమాలో నటించిన తొలి తెలుగు నటుడిగా రాజనాల పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని కీర్తి సంపాదించిన రాజనాల సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన వ్యక్తిగత, సినీ జీవిత విశేషాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1925 జనవరి 3న రాజనాల వెంకటనారాయణయ్య, సుబ్బమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. ఆయన ఇంటర్ వరకు చదువుకున్నారు. అయితే ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా. దానికోసం ఇంకా చదవడం ఎందుకు, ఇప్పుడే ఉద్యోగం చేస్తే సరిపోతుంది అనుకున్న రాజనాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి అందులో పాస్ అయి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గుమస్తాగా చేరారు. ఆ తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అయ్యారు. అవినీతికి పాల్పడకుండా, లంచాలు తీసుకోకుండా నీతిగా తన విధులు నిర్వహించేవారు రాజనాల. ఆ సమయంలోనే లక్ష్మీకుమార్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో కలిసి ఓ నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేస్తుండేవారు. ఆ క్రమంలోనే ఎవరు దొంగ, ప్రగతి అనే నాటకాలు వేశారు. ప్రభుత్వ శాఖలో ఉండే అవినీతిని ప్రశ్నించేవిగా ఆ నాటకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని ప్రశ్నించే పాత్రను పోషించాడని రాజనాలను మూడు నెలలు సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత లక్ష్మీకుమార్‌రెడ్డి మద్రాస్ వెళ్లి దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి దగ్గర చేరాడు. అదే సమయంలో అంతా కొత్తవారితో ప్రతిజ్ఞ చిత్రం చేస్తున్నారాయన. విలన్ క్యారెక్టర్ ఎవరితో చేయించాలా అని హెచ్.ఎం.రెడ్డి చూస్తున్నారు. తన మిత్రుడు రాజనాల గురించి ఆయనకు చెప్పారు లక్ష్మీకుమార్‌రెడ్డి. అప్పుడు రాజనాలను మద్రాస్ పిలిపించమని చెప్పారు. ఆ తర్వాత రాజనాలకు స్క్రీన్ టెస్ట్ చేసి కబురు చేస్తామని పంపించేశారు హెచ్.ఎం.రెడ్డి. 1951 డిసెంబర్‌లో ప్రతిజ్ఞ షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమాలో కాంతారావు హీరో కాగా, రాజనాల విలన్. అయితే అప్పటికే కాంతారావు రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ ప్రతిజ్ఞ సినిమా టైటిల్స్‌లో రాజనాల పేరు ముందు వేయడం విశేషం. ఆ తర్వాతే కాంతారావు పేరు వేశారు. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా రాజనాలకు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, అగ్రిమెంట్ ప్రకారం బయటి చిత్రాల్లో నటించడానికి వీల్లేకపోవడంతో వాటిని వదులుకున్నారు.
ఆ తర్వాత వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. 25 ఏళ్ళ రాజనాల.. ఎన్టీఆర్‌కి పిల్లనిచ్చిన మామగా నటించి ఆయన దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి రాజనాలను మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎన్టీఆర్ సొంతంగా నిర్మించిన చిత్రాల్లో విలన్‌గా అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇతర చిత్రాల్లోనూ రాజనాలను రికమెండ్ చేసేవారు. అలా అగ్గిపిడుగు, పిడుగు రాముడు, సువర్ణసుందరి, జయసింహ, వినాయక చవితి, కుటుంబగౌరవం, పల్నాటి యుద్ధం, గులేబకావళి కథ, గుండమ్మకథ, కంచుకోట, సిరిసంపదలు వంటి ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు సినిమాల్లోని విలనీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. 60వ దశకంలో రాజనాల చేతి నిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. హీరో ఎన్టీఆర్ అయినా, కాంతారావు అయినా విలన్ మాత్రం కాంతారావే ఉండేవారు. ఆ హీరోలిద్దరితో రాజనాల చేసిన కత్తియుద్ధాలు అప్పట్లో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునేవి. రాజనాల డేట్స్ కావాలంటే నిర్మాతలు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఒక దశలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారు రాజనాల. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆయన భార్య శోభ 32 ఏళ్ళ వయసులో మరణించారు. ఆరోజు కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్ దగ్గరుండి జరిపించారు. భార్య మరణంతో రాజనాల మానసికంగా కృంగిపోయారు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో 1971లో భూదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. 1975 వచ్చేసరికి ఇండస్ట్రీకి కొత్త కొత్త విలన్స్ రావడంతో రాజనాలకు అవకాశాలు బాగా తగ్గాయి. అయినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ తన సొంత సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు.
ఇదిలా ఉండగా 1984లో రాజనాల పెద్ద కుమారుడు మూర్ఛ వ్యాధితో మరణించాడు. ఆ తర్వాతి సంవత్సరం చిన్న కుమారుడు ఉద్యోగం కోసం ముంబాయి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో రాజనాల మానసికంగా బాగా కుంగిపోయారు. అలా ఆయనకు షుగర్ వ్యాధి సంక్రమించింది. కొన్ని వందల సినిమాల్లో నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా వాటిని దాన ధర్మాలకు, వ్యసనాలకు ఉపయోగించడం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయారు. చివరికి షుగర్ వ్యాధికి మందులు తెచ్చుకోవడానికి కూడా డబ్బులేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చేవి. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన నెంబర్‌వన్ చిత్రంలో, ఇవివి డైరెక్ట్ చేసిన హలోబ్రదర్ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. కృష్ణ హీరోగా రూపొందిన తెలుగు వీర లేవరా చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. షుగర్ వ్యాధి అధికంగా ఉండడంతో ఆయన కాలి వేలికి ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దాంతో ఆ వేలిని తొలగించారు. అయినా ఇన్‌ఫెక్షన్ కాలు మొత్తం పాకడంతో ఒక కాలును తొలగించారు. ఇక తను సినిమాల్లో నటించే అవకాశం లేదని గ్రహించిన రాజనాల చివరి దశలో తనకు తెలిసిన జోతిష్యం, హస్త సాముద్రికం చెబుతూ కొన్నాళ్ళు జీవనం సాగించారు. మానసిక కుంగుబాటు, షుగర్ వ్యాధి ఎక్కువ కావడం, ఒక కాలు లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో 1998 మే 21న తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా చరిత్రలో ప్రతి నాయకుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు రాజనాల పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు రాజనాల కాళేశ్వరరావు.
Also Read